కేసీఆర్‌పై ముస్లిం వర్గాల్లో అనుమానం?

కేసీఆర్‌పై ముస్లిం వర్గాల్లో అనుమానం?

జూబ్లిహిల్స్‌ రేప్‌ ఘటన ముస్లిం వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో నిందితులకు కచ్చితంగా తగిన శిక్ష పడాలని తాము కూడా కోరుకుంటున్నామని… కాని ముస్లిం నేతలను అడ్డం పెట్టుకుని మైనర్‌ అబ్బాయిలకు సంబంధించిన ఫోటోలు, సమాచారాన్ని మీడియాకు, బీజేపీ నేతలకు లీక్‌ అవడంపై నిన్న ముస్లిం వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. పోలీసులు వ్యూహాత్మకంగా మౌనం వహించడంతో దాదాపు ఓల్డ్‌ సిటీలోని పెద్దల పేర్లన్నీ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నిన్న రాత్రి వరకు గాని పోలీసుల నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో… మీడియా ద్వారా చాలా మంది పెద్దలను ఈ కేసు అడ్డం పెట్టుకుని బద్నాం చేశారని ఆరోపణలు ఉన్నాయి. కాని పెద్దల ప్రమేయం ఉన్న కేసుల్లో ఇతర పార్టీల జోరు సాధారణమే అని భావించారు. అయితే నిన్న అమ్మాయికి సంబంధించిన వీడియో… ఇవాళ అబ్బాయిలతో అసభ్య భంగిమల్లో అమ్మాయి ఉన్న వీడియోలు బీజేపీకి, మీడియాకు చేరడంతో ముస్లిం వర్గాల్లోనే గాక… పోలీసుల్లో కూడా ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసు ఆరంభం నుంచి ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ప్రతి అంశం ఉన్నతాధికారులకన్నా ముందే మీడియాకు చేరడంపై పోలీస్ వర్గాల్లో నిన్నటి నుంచే చర్చించుకుంటున్నారు. ఎంఐఎం నేతలు, హోం మంత్రి, వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ పేర్లు రావడంతో.. హై ప్రొఫైల్‌ కేసు కాబట్టి ఎవరూ మాట్లాడలేదు. కాని ఇవాళ మీడియాకు రిలీజ్‌ అయిన వీడియోపై మాత్రం ముస్లిం వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కొంత మంది కాంగ్రెస్‌ నేతలు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా అత్యంత కీలకమైన వీడియో మీడియా చేతికి, బీజేపీ నేతల చేతికి ఎలా వెళ్ళిందనే చర్చ ఇపుడు హైదరాబాద్‌లో బహిరంగంగానే జరుగుతోంది. బీజేపీకి మైలేజీ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. ముస్లిం పెద్దలను డిఫెన్స్‌లో పెట్టేందుకు వారి పిల్లల ఫొటోలను లీక్‌ చేశారని వీరు అనుమానిస్తున్నాయి. కాని ఇందులో అమ్మాయి ఉన్న వీడియోలను రిలీజ్‌ చేయడంపై మాత్రం ముస్లిం వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. అమ్మాయి తండ్రి పేరు బయటకు చెప్పకపోవడం, వారు మీడియా ముందుకు రాకపోవడంతో… రేప్‌ జరిగింది హిందూ అమ్మాయిపై అన్న వదంతి రాష్ట్రంలో వ్యాపించింది. సీఎంకు చెందిన పత్రిక నుంచి అన్ని పత్రికలు అమ్మాయి ఫ్యామిలీకి సంబంధించిన ఏమాత్రం సమాచారం రాయకపోవడం.. బీజేపీకి బాగా కలిసి వస్తోంది. కాంగ్రెస్‌ నేతలు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీలో అనుమానాలున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ వ్యూహంలో అమ్మాయి వీడియోను వాడుకోవడం దుర్మార్గం అని మీడియాలోనూ చర్చ జరుగుతోంది. ప్రధాన ఛానల్స్‌కు సమాచారం లీకు చేసి… ఇతర ఛానల్స్‌ను దూరంగా పెట్టడంతో మీడియాలో ప్రభుత్వం వైఖరిపై అసంతృప్తి వ్యక్తమౌతోంది. దాదాపు అన్ని ప్రధాన న్యూస్ ఛానల్స్‌ ఏకంగా రెండు రోజులు ఈ రేప్‌ ఘటనకు కేటాయించి…తమ రేటింగ్స్‌ పెంచుకునేందుకు వాడుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ కూడా అబ్బాయిలతో అమ్మాయి ఉన్న వీడియోలను ప్రసారం చేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పెద్దల మద్దతు లేనిదే ఛానల్స్‌ ఇలాంటి విజువల్స్‌ ప్రసారం చేయవని మీడియాలోనే చర్చ జరుగుతోంది.

Related Articles

Leave a Reply