TS: వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ ఎవరు?

TS: వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ ఎవరు?

తెలంగాణలోని రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ఈనెల 28వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇపుడున్న బోర్డు పదవీకాలం ఈనెల 22తో ముగియనుంది. బోర్డు ఎన్నికల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుండగా, మిగిలిన ఆరుగురు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రభుత్వం నామినేట్‌ చేసే వారిలో ఒకరు షియాల నుంచి మరొకరు సున్నీ స్కాలర్‌ ఉంటారు. అలాగే ఇద్దరు మహిళా సభ్యులు ఉంటారు.ఇందులో కూడా ఒకరు షియా నుంచి, మరొకరు సున్నీల నుంచి ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. ఈ నలుగురే కాకుండా డిప్యూటీ సెక్రటరీ కంటే అధిక స్థాయి ఉన్న ఓ ప్రభుత్వ అధికారిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

ఒక ఎన్నికైన సభ్యులలో ఎంపీ కోటాలో ఒకరు, శాసన మండలి, అసెంబ్లీ కోటాల నుండి ఇద్దరు, బార్ కౌన్సిల్ నుండి ఒకరు ఉంటారు. వక్ఫ్ సంస్థల ముతవల్లి, మేనేజింగ్ కమిటీ నుండి మిగిలిన ఇద్దరిని ఎన్నుకుంటారు. ఎంపీ కోటా మినహా అన్ని కేటగిరీల నుండి ఇప్పటివరకు దాదాపు 20 నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కార్వాన్ శాసనసభ్యుడు కౌసర్ మొహియుద్దీన్, న్యాయవాది జాకీర్ హుస్సేన్, మత గురువు అక్బర్ నిజాముద్దీన్ ఉన్నారు. ఈనెల 28న ఓటింగ్‌ జరుగుతుంది. మొత్తం 475 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ప్రస్తుతం మహ్మద్ సలీమ్ ఐదేళ్లుగా బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు.

Leave a Reply