మణికొండ భూములు ఇచ్చేయండి

మణికొండ భూములు ఇచ్చేయండి

హైదరాబాద్‌ నగరంలో ఐటీ కంపెనీలకు హబ్‌గా మారిన మణికొండలో దర్గా హుస్సే షా వలికి చెందిన 1654 ఎకరాల కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ మైనారిటీ హక్కుల పరిరక్షణ ఫోరమ్‌ (Minority Rights Protection Forum -MRPF) డిమాండ్‌ చేసింది. కేసు ఉసంహరించుకుని సదరుభూములను వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ఫోరమ్ కోరింది. ప్రభుత్వం అలా చేయకుండా వచ్చే ఎన్నికల్లో దీన్ని ఒక ప్రధాన అంశంగా చేస్తామని ఫోరమ్‌ పేర్కొంది. ఇప్పటి వరకు ముస్లిం అనుకూల విధానాలు అవలంబించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెల్లగా ఆ మార్గం నుంచి తప్పుకుంటోందని ఫోరమ్‌ నాయకులు సనా ఉల్లా ఖాన్‌, మొహమ్మద్‌ నదీమ్‌, సయ్య సయీవుద్దీన్‌ తన్విర్‌, నయీముల్లా షరీఫ్‌, మైనుద్దీన్‌ ముజాహిద్‌, ఎంఏ మాజిద్‌, డాక్టర్ అన్వర్‌ ఖాన్‌, ముజాహిద్‌ హాష్మి అన్నారు. షంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు కోర్టు హజరత్‌ బాబా షరీఫుద్దీన్‌ పహాడీకి చెందిన భూములు ఆక్రమించుకున్నారని… దీనికి గాను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె డిమాండ్ చేయాలని ఫోరమ్‌ నాయకులు అన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషియల్‌ పవర్స్‌ ఇస్తానని కేసీఆర్‌ పలుమార్లు హామి ఇచ్చారని, కాని ఇంకా హామీగా నిలిచిపోయిందని వారు అన్నారు. అలాగే రూ. 20 కోట్లతో ఇస్లామిక్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పని ప్రారంభించలేదని ఆరోపించారు. వివిధ కోర్టుల్లో వక్ఫ్‌ భూములను కాపాడేందుకు కొందరు నిజాయితీ పరులైన బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారని… లాయర్లకు తగిన సమాచారం, సలహాలు ఇస్తున్నారని… అలాంటివారిని బదిలీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని ఫోరమ్ నాయకులు డిమాండ్‌ చేశారు. నిజాయితీ పరులైన అధికారులను బదిలీ చేయడంతో పాటు సుప్రీం కోర్టు ముందు కీలక డాక్యుమెంట్లను సమర్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఫోరమ్‌ నాయకులు ఆరోపించారు. దీంతో కోర్టు తీర్పు ప్రభుత్వానికి… భూమి పొందిన ల్యాంకో హిల్స్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఫోరమ్‌ పేర్కొంది. ఆక్రమించుకున్న భూమి 1898 ఎకరాలు కాగా, కేవలం 1654 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు మాత్రమే సమర్పించారు.ఈ భూముల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించింది. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూమిని బహుళజాతి సంస్థలకు, జాతీయ, స్థానిక సంస్థలకు బదిలీ చేశాయని ఫోరమ్‌ ఆరోపించింది.

Leave a Reply