ఉర్దూ మీడియా కొనసాగించాలి

ఉర్దూ మీడియా కొనసాగించాలి

ఉర్దూ బాష చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉర్దూ మాధ్యమాన్ని కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు తరలించేందుకు మ్యాపింగ్ చేస్తున్నారని, దీనివల్ల ఉర్దూ భాషకు ప్రమాదం ఏర్పడనుందని ఆయన ఓ పత్రికా ప్రకటనలో అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 1062 ప్రాధమిక, 330 ప్రాధమికోన్నత, 109 ఉన్నత పాఠశాలల్లో చదువుతోన్న 77,286 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉర్దూ బోధిస్తున్న వారిలో చాలా మందికి బీఈడీ అర్హత లేదని, 1,2 తరగతులకు ఉర్దూ బోధించడం లేదని, వీరిని ఎక్కడ నియమిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఒక్క ఉర్దూ అంగన్‌ వాడీ కేంద్రం లేనప్పుడు మాధ్యమ పాఠశాలలను విలీనం ఎలా చేస్తారని, ఇష్టమొచ్చినట్లు విలీనం చేస్తే ఉర్దూలో చదువు ఎవరు చెబుతారని మస్తాన్ వలీ ప్రశ్నించారు.
రాయలసీమ జిల్లాల్లో 92 ఉన్నత పాఠశాలలు ఉండగా మిగతా జిల్లాల్లో 17మాత్రమే ఉన్నాయని, ఇవి కాకుండా ప్రాథమికోన్నత పాఠశాలలు 330 ఉండగా వీటిల్లో 220 చోట్ల అధ్యాపకులు, గదుల కొరత తీవ్రంగా ఉందని మస్తాన్‌ వలీ అన్నారు.ఉర్దూ మాధ్యమం చదువుతున్న 3,4,5 తరగతులను ఉర్దూ పాఠశాలల్లోనే విలీనం చేయాలని, ఇతర మాధ్యమ బడులకు పంపిస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. ఉన్నతీకరించిన 220 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వసతులు లేవని, వీటన్నింటినీ పరిష్కరించాలని మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply