ఎర్రగొండపాలెంలో ఏం జరిగింది?

ఎర్రగొండపాలెంలో ఏం జరిగింది?

హిజాబ్‌ అంశం ఇపుడు జాతీయ అంశంగా మారింది. ప్రతి రాష్ట్రంలోనూ దీనికి సంబంధించి ఏదో ఒక గొడవ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వాటికి భిన్నంగా ప్రశాంతంగా ఉన్నాయి. అయితే మొన్న విజయవాడ లయోల కాలేజీ, ఇవాళ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటనలో ముస్లిం సమాజం ఉలిక్కి పడింది. ముఖ్యంగా ఎర్రగొండపాలెంలోని చింతపల్లి వీధిలో వికాస్ పబ్లిక్ స్కూల్లో ఇవాళ చోటు చేసుకున్న హిజాబ్‌ వివాదంపై విద్యార్థుల తలిదండ్రులతో పాటు ముస్లిం సమాజం పెద్దలు కూడా వెంటనే చొరవ తీసుకున్నారు.
ఇవాళ ఉదయం ఎప్పటిలాగే విద్యార్థులు వికాస్‌ స్కూల్‌కు హిజాబ్‌తో వెళ్ళారని, కాని కరస్పాండెంట్‌ హిజాబ్‌ తీసేసి క్లాసుకు రావాలని చెప్పడంతో కొందరు విద్యార్థులు ఇంటికి వచ్చేశారు. ఈ విషయాన్ని విద్యార్థుల తలిదండ్రులు ముస్లిం పెద్దలకు చెప్పడంతో అందరూ వికాస్‌ స్కూల్‌ కరెస్పాండెంట్‌ వద్దకు వెళ్ళారు. విద్యార్థుల తలిదండ్రులు ధర్నా చేపట్టగా, పోలీసులు కూడా వచ్చారు. హైస్కూల్‌ కరెస్పాండెంట్‌ క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారం సద్దు మణిగింది.

ముస్లిం పెద్దల జోక్యం
వికాస్ పబ్లిక్ స్కూల్లో ఇవాళ చోటుచేసుకున్న హిజాబ్‌ వివాదంపై ముస్లిం మత పెద్ద మౌలానా హిదాయతుల్లా మాట్లాడుతూ…ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ విషయమై పేరెంట్స్‌, తాము కలిసి హైస్కూల్‌ కరస్పాండెంట్‌తో మాట్లాడామని అన్నారు ”మా ఒక్క స్కూల్‌లోనే కాదు మిగతా స్కూళ్లలో ఇలానే చేస్తున్నారు, వారిని కూడా మీరు ప్రశ్నిస్తారా అని ఆ స్కూల్‌ యాజమాన్యం మమ్మల్ని అడిగింద”ని మౌలానా చెప్పారు. అయితే ముస్లిం సమాజాంలో పరదా ప్రాధాన్యాన్ని వివరిస్తూనే క్లాసులకు ఎలా రావొద్దంటారనే అంశంపై తాము హైస్కూల్‌ కరస్పాండెంట్‌ను గట్టిగా ప్రశ్నించామని మౌలానా హిదాయతుల్లా తెలిపారు. ఇతర స్కూల్స్‌ కూడా ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేయడంతో తాము ఎంఈఓకు పిర్యాదు చేశామని, వెంటనే పోలీసు సిబ్బంది వచ్చారని ఆయన వివరించారు. ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలతో ఎంఈఓ ఓ సమావేశం నిర్వహించారు. చిన్న వయసులోనే పిల్లల మనసు విషంతో నింపరాదని, వారిని కలిసి మెలిసి ఆడుకోనివ్వాలని యాజమాన్యాలకు ఎంఈఓ ఆంజినేయులు  సూచించారు. ఇకనుంచి ఏ స్కూల్‌ యాజమాన్యమైనా హిజాబ్‌ గురించి విద్యార్థులను నిలదీస్తే తమకు పిర్యాదు చేయాలని ఎంఈఓ సూచించారని మౌలానా తెలిపారు.

ఎంఈఓ వివరణ
హిజాబ్ పై ప్రభుత్వం తరుపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని, ఏ స్కూల్‌లో అయినా హిజాబ్ వద్దని చెబితే తనకు ఫిర్యాదు చేయవచ్చని మేము వెంటనే చర్యలు తీసుకుంటానని ఎంఈఓ ఆంజినేయులుచెప్పారు. దీనికి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సైతం అంగీకరించాయన్నారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌తో తరగతులకు హాజరు కావచ్చని స్పష్టం చేశారు. ఏ స్కూల్‌లోనైనా హిజాబ్ వద్దని చెబితే తనకు ఫిర్యాదు చేయవచ్చని తాము వెంటనే చర్యలు తీసుకుంటానని ఎంఈవో అన్నారు.

హిజాబ్‌ వివాదంపై జమాతే ఇస్లామి హింద్‌ పట్టణ అధ్యక్షులు ఎస్‌.ఎ.రసూల్‌ సాహబ్‌ మాట్లాడుతూ… హిజాబ్ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని, తరతరాలుగా ముస్లిములు పాటిస్తున్న పరదా సంప్రదాయం వల్ల నేటిదాకా ఎవరికీ ఇబ్బంది కలగలేదన్నారు. ”తమ ధార్మిక విశ్వాసంలో భాగంగా ముస్లిములు ఈ పద్ధతులు పాటిస్తున్నారు. అందులో ఇతరులు జోక్యం అనవసరం. దుస్తుల విషయంలో ఆంక్షలు సమర్ధనీయం కాదు. ఇది ప్రాథమిక హక్కులకూ వ్యతిరేకమ”ని ఆయన అన్నారు.
ఖురాన్‌ ఇలా చెబుతోంది
హిజాబ్‌ విషయంలో ఖురాన్‌ ఏం చెబుతోందో రసూల్‌ సాహబ్‌ వివరించారు. ”నీ భార్యలకూ, నీ కూతుళ్లకు, విశ్వాసులైన స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై తలలపై వేలాడతీసుకోమని చెప్పు. వారు గుర్తించబడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్ధతి, అల్లాహ్‌ క్షమించేవాడునూ, కరుణించేవాడునూ.” (దివ్య ఖుర్‌ఆన్‌ 33:59)

Related Articles

Leave a Reply