ఇది శాంతి భద్రతల సమస్యా?

ఇది శాంతి భద్రతల సమస్యా?

ముస్లిం బాలికలు తలకు చుట్టుకొనే స్కార్ఫ్ (దీనినే హిజాబ్ అని తప్పుగా పేర్కొంటున్నారు) ధరించాలనుకోవడంలో ఎటువంటి వివాదం లేదు. కానీ బీజేపీ పాలిత కర్నాటక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను హిజాబ్ వివాదాలుగా వక్రీకరించి తప్పుదోవ పట్టించడం సరైనది కాదు..
ఇది భారత రాజ్యాంగం, చట్టాలు హామీ ఇచ్చిన విద్యాహక్కును ముస్లిం యువతులకు దూరం చేస్తూ వారిపై చేస్తున్న తీవ్రమైన దాడి తప్ప వేరు కాదు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే జాతీయ మానవ హక్కుల కమిషన్కు కొత్తగా వచ్చిన చీఫ్ కూడా ఉడిపిలోని జిల్లా అధికారులకు జనవరి 27 న ఒక నోటీసు జారీ చేసారు. అందులో తనకు ఒక ఫిర్యాదు. వచ్చిందనీ, ఆ ఫిర్యాదులో అక్కడి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, విద్యాహక్కు చట్టానికి భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. దీనిని బట్టి ఈ కేసులో బాధిత విద్యార్థుల మానవ హక్కుల ఉల్లంఘన ఎంత తీవ్రంగా జరిగిందో తెలుస్తోంది.
రెండు నెలల్లో 12వ తరగతి పరీక్షలు రాయబోతున్న వందలాది ముస్లిం మహిళల భవిషత్తుకు భంగం కలిగేలా కర్నాటక ప్రభుత్వం పూర్తి దురుద్దేశ్య పూర్వకంగా ఫిబ్రవరి 5 న ఉత్తర్వు ఇచ్చింది. ఈ ఉత్తర్వుపై కర్నాటక హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర స్టే విధించక పోవడం చాలా అసంతృప్తికరమైన చర్య విద్యార్థులు ప్రీ యూనివర్సిటీ విద్యా విభాగానికి సంబంధించిన కాలేజీ అభివృద్ధి కమిటీ లేక ఫ్రీ యూనివర్సిటీ కాలేజీల యాజమాన్య బోర్డుల అప్పిలేట్ కమిటీలు సూచించిన దుస్తులు ధరించాలని 1983 లో వచ్చిన కర్నాటక విద్యా చట్టం 133 (2) సెక్షన్ చెప్తోంది. దీనిని కూడా ఈ ప్రభుత్వ ఉత్తర్వు తప్పు దారి పట్టిస్తోంది.
యాజమాన్య కమిటీ ఒక యూనిఫామ్ను సూచించని పక్షంలో సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి దుస్తులు ధరించరాదని చెపుతున్న 133 (2) సెక్షన్ కూడా ప్రస్నార్థకంగానే ఉంది. ఇది విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యానికి అవకాశం కల్పిస్తోంది. నిజానికి యూనిఫారాలు ఈ విభాగం క్రిందికిరావు
ఈ చర్యలు దురుద్దేశ్యంతో కూడి ఉన్నాయనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. కర్నాటకలోని కాలేజీ అభివృద్ధి కమిటీలకు ఆయా కాలేజీలు ఉన్న ప్రాంతాలలో ఎన్నికైన ఎమ్మెల్యేలు నేతృత్వం వహిస్తారు. మొట్టమొదట ఈ సమస్య తలెత్తిన ఉడిపి జిల్లాలోని పీ.యూ కాలేజీకి బీజేపీ ఎమ్మెల్యే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన సూచన మేరకే తలకు స్కార్ఫ్ చుట్టుకున్న అమ్మాయిలు క్యాంపస్లోకి రాకుండా ఆపాలని నిషేధం విధించారు. అంతకుముందు కాలేజీలో తలకు స్కార్ఫ్ చుట్టుకోరాదనే నిబంధనలు ఏవీ లేకపోయినా కొత్త నిబంధనలు విధించారు.
ఒక వేళ విద్యార్థినులు క్యాంపస్ లో హిజాబ్ ధరించడానికి కాలేజీ అనుమతిస్తే కనుక మేము హిందూ విద్యార్థులందరూ క్యాంపస్ లోపల కాషాయ శాలువాలు ధరించేటట్లు చేస్తామని భజరంగ్ దళ్ ఉడిపి జిల్లా కార్యదర్శి సురేంద్ర కొటేశ్వర్ బెదిరించారు.
ప్రభుత్వ అండతో తన ప్రణాళిక అమలు చేసాడు. మొదటగా ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా ఇలాంటి వారితో భజరంగ్ దళ్ సహకారంతో కాషాయ కండువాలు కప్పుకొని ఆవేశంతో ఉన్న యువకులను ముస్లిం యువతులకు వ్యతిరేకంగా సమీకరించింది. తరువాత వారిని గేట్ల వద్ద ఆపివేయబడిన ముస్లిం మహిళలు ఉన్న కాలేజీల వద్దకు రావడానికి అనుమతించింది. వారు అమ్మాయిలను అవహేళన చేస్తూ వారిని వేధిస్తున్నా కూడా అక్కడే ఉన్న పోలీసులు దానిని నివారించకుండా ప్రేక్షకపాత్ర వహించి తాము పక్షపాతం లేకుండా వ్యవహరించామని చెప్పుకున్నారు.

తలకు చుట్టుకొనే స్కార్ఫ్ వలన శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చు కనుక కాలేజీకి అటువంటి నిబంధనలు ఉన్నా లేకున్నా దానిని నిషేధిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నిజానికి ఉడిపి జిల్లాలోనే ఉన్న భండార్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనే ఇంకొక కాలేజీలో అమ్మాయిలు హెడ్ స్కార్ఫ్ ధరించవచ్చని అనుమతిస్తూ దాని రంగూ, దుపట్టా రంగూ ఒకేలా ఉండాలని చెప్పింది. కానీ ప్రస్తుతం ఆ నిబంధన ఉన్నా కూడా అమ్మాయిలను కాలేజీలోకి అనుమతించడం లేదంటే అది తీవ్రమైన అన్యాయం కాక మరేమిటి. ఈ విధంగా ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడంతో అది వారి కమ్యూనిటీలో ప్రతిచర్యకు దారితీయడమే కాక అంతకు ముందు స్కార్ఫ్ ధరించని మహిళలు కూడా స్కార్ఫ్ ధరించి తమ నిరసన తెలియచేయడానికి దారి తీస్తుంది. కర్నాటకలో ప్రస్తుతం మనం ఇదే చూస్తున్నాం. ఈ పరిస్థితిలో మహిళల స్వేచ్ఛకు అడ్డుపడే ముస్లిం చాందసవాద సంఘాలు కూడా బలపడి తమ ఛాందసవాద భావజాలాన్ని బలపరుచుకోవడం జరుగుతుంది. యూనిఫామ్ బాలికలు విద్యాసంస్థలలో విధానా వ్యతిరేకిస్తున్నాట్లుగా దీనిని చిత్రీకరిస్తున్నారు.
కర్నాటక విద్యాశాఖా మంత్రి బీ.సీ నాగేష్ మాట్లాడుతూ … విద్యార్థులందరూ ప్రభుత్వం సూచించిన యూనిఫామ్ను గౌరవించాలని తాను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాననీ, ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ నిబంధనలు పాటించని వారికి స్కూలులో ప్రవేశించి క్లాసులకు హాజరయ్యే అవకాశం ఉండదని స్పష్టంగా చెప్పారు. ముస్లిం బాలికలు నిర్దేశించిన యూనిఫామ్లు దరిస్తూనే ఉన్నారు. దానికి తోడు వారు తమ తలలను హెడ్ స్కార్ఫ్ కప్పుకుంటున్నారు. అంతే కానీ వారు యూనిఫామ్ బదులుగా బుర్ఖాలు వేసుకోవడం లేదు. వారు తమ ముఖాలు కప్పుకోవడానికి ముసుగులు ధరించడం లేదు. సిక్కు మతానికి ఆది యూనిఫామ్ నిబంధనలను ఉల్లంగించడం కిందికిరాదు. ఇది శాంతి భద్రతలకు సంభందించిన విషయమని వాదించడం పూర్తి అసంబద్ధమైనది. గత ఎన్నో సంవత్సరాలనుండీ ఎప్పుడూ కూడా కర్నాటకలో కానీ మొత్తం భారత దేశంలోకానీ ఇటువంటి శాంతిభద్రతల సమస్య ఎన్నడూ ఉత్పన్నం కాలేదు .
పొరుగున ఉన్న కేరళ రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినులు తాము కోరుకుంటే హెడ్ స్కార్లు ధరించవచ్చు. కోరుకోవడంలేదు . అక్కడ ఖచ్చితంగా వేసుకోకూడదని వేసుకోవాలని కానీ నిబంధనలేమీ లేవు. కేరళలో హెడ్ స్కార్లు ధరిస్తున్న బాలికలతో శాంతి భద్రతల సమస్యలేవీ తలెత్తడంలేదు. ఆ రాష్ట్రంలో ముస్లిం మహిళలలో అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉండడంతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలలో ముస్లిం బాలికల నమోదు అత్యధికంగా ఉంది .

కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఉద్దేశ్యపూర్వకమైనది . రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికీ భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు తన కిష్టమైన మతాన్ని నమ్మడానికీ, ఆచరించడానికి, ప్రచారం చేసుకోడానికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం శాంతి భద్రతల సాకుతో ఈ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలైన ఏ మతాన్నైనా నమ్మే , ఆచారించే , ప్రచారం చేసుకొనే హక్కుల వలన శాంతి భద్రతల సమస్యలు వస్తున్నట్లు చిత్రీకరిస్తోంది .

కేరళ హై కోర్టుకు సంబందించిన ఒక కేసులో ( ఆమ్నా బింట్ బషీర్ వర్సెస్ సీబీఎస్ . ఈ 2016 ) ఇచ్చిన తీర్పులో ఒక ముస్లిం మహిళ పొడవు చేతుల దుస్తులు ధరించడం , హెడ్ స్కార్ఫ్ ధరించడం అనే అంశాలు ఆమె మతపరమైన ఆచారాలనీ వాటికి ఆర్టికల్ 25 కింద రక్షణ ఉన్నదని పేర్కొంది . ఈ కేసులో ఒక ముస్లిం విద్యార్థినికి సీబీఎస్ ఈ డ్రెస్ కోడ్ ప్రకారం పొట్టిచేతుల దుస్తులు ధరించాలనీ , హెడ్ స్కార్ఫ్ ధరించరాదనీ చెప్పడం అంటే సెక్షన్ 25 ప్రకారం ఆమె ప్రాధమిక హక్కులను హరించడమేనని చెప్పడం జరిగింది . అదే సందర్భంలో సీబీఎస్ ఈ వాదన ప్రకారం పరీక్ష హాలులోకి మోసపూరితంగా పేపర్లు తేవడాన్ని నిరోధించేందుకు ఆ మహిళలు సీబీఎస్ఈ నియమించిన అధికారులచే భౌతిక తనిఖీకి సహకరించాలని చెప్పింది . అంతేకానీ ఇది శాంతిభద్రతల సమస్యనో లేక నిజాయితీకి సంబంధించిన సమస్యనో కాదని కోర్టు స్పష్టం చేసింది . ఆ విధంగా పరీక్షా విధానంలో సమగ్రతను కాపాడడంతో పాటుగా ఆమె ప్రాధమిక హక్కులకు కూడా రక్షణ కల్పించబడింది. ఇంతకుముందు కూడా 2015 లో ఇంకొక కేసులో (నదియా రహీం వర్సెస్ సీబీఎస్ఈ) కోర్టు ఇద్దరు ముస్లిం విద్యార్థినులు వారి మతాచారం ప్రకారం పొడవు చేతుల దుస్తులు ధరించేందుకూ, హెడ్ స్కార్ఫ్ ధరించేందుకు వేసిన పిటిషన్ ను సమర్థించింది . భిన్న సాంప్రదాయాలూ , మతాలూ ఉన్న దేశంలో ఒకే డ్రెస్ కోడ్ను అనుసరించాలనీ లేకుంటే వారిని పరీక్షలకు అనుమతించమనీ వత్తిడి చేయరాదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కూడా కోర్టు సీబీఎస్ఈ సూచనల మేరకు విద్యార్థిని భౌతిక తనిఖీలకు సహకరించాలని చెప్పింది. కర్నాటక ప్రభుత్వం ఈ కోర్టు తీర్పులనన్నిటినీ తప్పుదోవ పట్టించే దురుద్దేశ్యంతోనే కోర్టులో వాదనలు జరిగే ముందుగానే అక్కడ శాంతి భద్రతల సమస్యలు. తలెత్తినట్లుగా చూపింది . వాస్తవానికి మన దృష్టి మరింత ఎక్కువమంది పిల్లలకు విద్యాహక్కును విస్తరించే ఆలోచన తో ఉండాలి. ఈ రెండు సంవత్సరాల ఆన్లైన్ క్లాసులతో బాలికలు ఎక్కువగా నష్టపోయారు. విద్యాహక్కు చట్టం ఫోరమ్ లెక్కల ప్రకారం కోవిడ్ 19 మహమ్మారి కారణంగా మన దేశంలో 10 మిలియన్ల బాలికలు మాధ్యమిక విద్య నుండి తప్పుకున్నారు . కర్నాటకలో గ్రామీణ అభివృద్ధి శాఖ , పంచాయతీరాజ్ కలిసి ఒక సర్వే నిర్వహించి జూలై 2021 లో ఆ రాష్ట్ర హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. దాని ప్రకారం గ్రామీణ కర్నాటకలో 1.59 లక్షల మంది పిల్లలు బడి ముఖం చూడనివారు ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఒక సంకుచితమైన ఎజెండాతో బాలికలు బడులకు హాజరుకాకుండా బలవంతంగా వారిని ఆపుతున్నారు. ఇదంతా చూస్తూంటే ప్రభుత్వం ఇచ్చిన ” బేటీ బచావో బేటీ పడావో ” నినాదం . లో ముస్లిం బేటీలకు ( కూతుర్లకు ) స్థానం లేదేమో అనిపిస్తుంది . యువతీయువకుల భావోద్వేగాలను ఈ బలగాలు ఇంత క్రూరంగా తప్పుదోవ పట్టించడం చాలా బాధాకరం . ఆన్లైన్ తరగతులను అందుకోలేని లక్షలాది మంది విద్యార్థులు తమ చదువులను నష్టపోయిన ఈ తరుణంలో యువజనులలో ఇటువంటి ఘర్షణలు సృష్టించి వారిని విభజించడం నేరపూరితమైన చర్యలు కాక మరేమిటీ. విద్యాసంస్థలలో హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికే ఇంతటి ఘోరాలకు పాల్పడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి స్థానంలో మతోన్మాద మహమ్మారి ప్రవేశించింది. ఈ వైరస్ హిందూత్వశక్తుల ప్రయోగశాలలో తయారైంది. ఫలితంగా యువతీయువకుల జీవితాలకు నష్టం కలిగే విధంగా విద్యాసంస్థల లాక్డౌను దారి తీసింది.
(అనువాదం : కె.నాగలక్ష్మి)

(17 ఫిబ్రవరి 2022న నవ తెలంగాణ పత్రికలో సీపీఎం నేత బృందా కారత్‌ రాసిన వ్యాసం ఇది)

Related Articles

Leave a Reply